Thursday, February 18, 2010

యుగాది

కం:-
తల్లికి, తండ్రికి, విద్యా
వల్లభులకు, వేల్పులకును, పరమేశునకున్,
ఉల్లమున విరాజిల్లెడి
యెల్లరి పూజకు యుగాది యిరవుగ వెలసెన్.

ఉగాది కవిసమ్మేళనంలో నేను పూరించిన సమస్యలు:-

చం:-
అట్నములెట్లుగట్టెదము, ఆపదలొచ్చెనె యాంధ్రదేశమున్!
కట్నము కోట్లలెక్కలుగ గట్టితిమీ తొడగొట్టు నేతకున్,
పట్నములమ్ము పొట్లముల పాలకుడే గద రావణుండహో!
రాట్నము చేతబట్టుకొని రాక్షస కృత్యము చేసినాడహో!

ఆ:-
సారు పెరిగెనిచట చారన్నమున్ తించు,
యెన్నికవక మునుపు యెగువ సభకు.
వారి పేరు కాన, వూరికంటించారు
పేరు గొప్ప కాని వూరు దిబ్బ.

కం:-
లావొక్కింతయు లేదు, ప
లావులు పది ప్లేట్లపైనె లాగించిందే!
బావురుమనకోయి పతీ!
ఆవిడ యాకలి కనుగొని ఆలస్యముగా.

కం:-
కావలె కవినని తలచుచు,
నే వలచితి కవితలన్ను నిరుడేగా! డీ
లావొక్కింతయు లేదు, స
జావుగ యిదిసాగిన యదె చాలనుకొందున్.

Monday, February 15, 2010

చమత్కారం

నాకు, మా ఆవిడకి మధ్య సంభాషణ, పద్యరూపంలో. రెడ్మండ్ నుంచి డాలస్ (రెండువేల రెండువందల మైళ్ళు) కారులో వెళ్దాం అని...

కం:-
కారెక్కి చేరుకొనెదము,
తేరగ మీయక్కయింట తినిత్రేన్చెదమోయ్.
దూరము భారమె కాదన,
సారధి నేనేగ, తగవు సందేహములున్.

కం:-
కారంటూ పోరు తగదు,
దూరాలకు రాను నేను దుర్గమగతులన్.
బేరాలాడకు, వేరుగ
యేరోప్లేనెక్కివత్తు, యేడ్వకు నాథా!

కొంటెగా కవ్విద్దామని,
కం:-
కుదురుగ బుద్ధియు నుంచదు,
కుదరదు కదుపని విషయము కువలయమందున్,
బెదురును కదిపిన పిమ్మట,
ముదితకు మరి మరకటముకు ముచ్చటలొకటౌ!

నా కవితల పోరుపడలేకపోతున్నానంటున్న మా ఆవిడ రియాక్షన్.
కం:-
కైతల రాయుని గట్టుకు
నైతిని నేనప్పడంబు, అయ్యో వినడే!
నాతని, కోతని, మూతని,
నాతల తింటాడు వీడు నానా విధముల్.

అమ్మ

ఆ:-
శ్యామసుందరముఖి సౌఖ్యాన చెలగవే,
రామశాస్త్రి యింట రాణిలాగ.
నిండు చందమామ నీవంచు నలుగురు
చెప్పనీదుయశము చిరముకాగ.

సీ:-
నవమాసములు మోసి నన్నుగాచిన తల్లి అవనిలో తారాడు ఆదిశక్తి,
ఆకలనకమున్నె యన్నంబుదినిపించు అమృతాంబునిధియామె అన్నపూర్ణ,
అమరమై నిలిచెడి అక్షరమ్ములు మప్పి సద్బుద్ధులొసగిన శారదాంబ,
తనబిడ్డ సుఖముకై దైవాల ప్రార్ధించు విమలహృదయెనాకు విజయలక్ష్మి.

ఆ:-
పలుకుతేనెలమ్మ పద్యాభిషేకంబు
జరుపగోరె మనసు సాదరముగ,
కరుణ చిలుకు తల్లి కైమోడ్పులివ్వియె
అందుకొనుమ మాదు వందనాలు.

ఆ:-
పచ్చపూలుదెచ్చి పారిహార్యముగట్టి
యిచ్చుకొనగనేను యింటలేను,
అచ్చతెనుగుతోట యచ్చరాలనుగుచ్చి
దెచ్చిమాలగజేసి నీకు వేస్తి.

(సందీప్ సహాయానికి కృతజ్ఞుతలతో...)