Sunday, August 15, 2010

భారత స్వాతంత్ర్యపర్వదినం

కం:-
మాతల్లి! భూమి భారతి
చేతన మహనీయ ధాత్రి! చేతున్ జయతుల్;
స్వాతంత్ర్యపర్వదినమున
భూతలి నలుదిక్కులలర భూయిష్ఠముగన్!

కం:-
దేశము భాషామతము
ద్దేశములున్ వేరువేరు తీరులనంచూ,
ఆశీవిషముకు వలెనా
వేశాగ్రణిగ మనుట, తగు మేలా మనకున్?

మత్తకోకిల:-
భారతీ! భరతాది దివ్యుల భవ్యసీమవు నీవుగా!
వారణాసి, గయప్రయాగల వాసిగాంచిన భూమివై,
మారణాయుధ ఘాతముల్, మరి మాయజేసెడి నేతలన్
ఓరిమిన్ భరియింపజాలున? నోడగొట్టుమ వారలన్!

Sunday, August 8, 2010

శివునిపై "శ్రీ" చక్ర బంధ తేటగీతము

తే:-
శిశిర రాజుకు శ్రీకంఠి చేవ; దేని
నిబిడు నాముఖశ్రీ? ఫాలనీలికాంతి
యమళులందున శ్రీలు; మాయా స్వభావ!
శివుని ఛాయన నిర్భీతి జీవరాశి.

భా:-
శివుడంటే జటాజూటాలతో భీతిగొలిపేలా ఉంటాడని, స్మశానంలో నర్తిస్తాడని విని భయపడనవసరంలేదు. చంద్రునకు ఆయనే కదా ఆధారం. నీలి కలువలలో ఆయన మూడవనేత్రాన్ని కలిగి ఉండే ఫాలము యెక్క కాంతే కదా ప్రతిబింబిస్తుంది. వీటిని చూసి మనం ఆనందించటంలేదా? మాయతో కూడిన స్వభావం కలవాడు కనుకనే మనకు అలా అనిపిస్తుంది. అసలు చెప్పాలంటే ఆయన రక్షలో సృష్టి యెంతో సురక్షితం.