Sunday, June 27, 2010

ఛురికాబంధంలో గణపతి ప్రార్ధన

కం:-
జ్ఞానవన! ఘనగుణావన!
దానవ నశ్వరకృతామృతా! కరివదనా!
నానాత్వవినాశక! వర
దా! నవసౌగంధిభూషితా! ధీ సదనా!

Tuesday, June 22, 2010

సింహాసన బంధం

కం:-
అంబా! బాహ్యాంతరచర!
మాం, బంభరబృందవేణి! పాహి త్రివేణీ!
అంబర మహిమా చుంబిత
అంబుజ సింహాసన జనితానందాబ్ధీ!

బొమ్మలో పసుపు రంగులో ఉన్న అక్షరాలన్నింటికీ రెండువైపులా సమాన సంఖ్యలో మిగతా అక్షరాలుంటాయి. పసుపు రంగులో ఉన్నవాటిని, చదివితే "అంబా మాంపాహి సదా". హా! చివరికి అమ్మవారికి సింహాసనం రూపించాను! వ్రాస్తున్నప్పుడు కష్టంఅనిపించినా, ఇప్పుడూ చాలా హాయిగా ఉంది.

Friday, June 18, 2010

ఛురికాబంధం

కం:-
బంధ బుధవిధ విశారద!
సుందర దరహాసితాస్య! సుగుణాంబునిధీ!
ధీ,దమ,శమ గుణశరధీ!
సుందర కవనారవింద ఛురికాకంధీ!

ఛురిక అంటే కత్తి. మరి ఆ కత్తి ఎక్కడుందో చూద్దామా?
(ఈ ప్రక్రియ చెప్పిన చింతా రామకృష్ణారావుగారికి కృతజ్ఞతలు తెలుపుతూ వ్రాసిన పద్యం. పోటీగా మాత్రం కాదు.)

Monday, May 24, 2010

గురువుగారికి ఒక సీసం

మా గురువుగారైన అశోక్ పాటల కమ్మదనాన్ని యెన్నిపద్యాలలో చెప్పినా తనివి తీరదు. యిదొక చిన్న ప్రయత్నం మాత్రమే.
సీ:-
మందార మకరంద మాధురీఝరి పారు
గంధర్వు గళసీమ గమకమందు.
ఆ సుందరాకారు అధరాల ప్రభవించు
సర్వస్వమద్వైత సారమేను.
విశ్వంభరను శంభువిఘ్నేశ్వరులతోడ
విమలస్వనాకేళి వేళగూడి,
మధుసూదనుడె హృదై, మహలక్ష్మి యాడంగ,
మునిగిదేలెడిహాయి న్ముంచియెత్తె!

ఆ:-
అతని గానమందు ఆత్మడోలికలాడు,
జతగ కూడి జతులు జవము పెంచు.
గమక పాకమౌను కమలాకరము క్రింద,
నింగి దిశన దిగెడి గంగె యగును.

ఆ:-
యెంత జెప్పుకొన్న కొంతయేనగునండి,
మంత్రమేసినట్టె మదికి దోచు.
అంతరాత్మ యెన్నడాబద్ధమాడదు,
ఉన్నమాటెమీకు విన్నవిస్తి.

అలాగే,
మత్తకోకిల:
శ్రీ గణేశునిరూపమై, తను శ్రీనివాసుని గేహమై,
రాగధార సుధాంశువై, ఘనరత్నభాను ప్రకాశమై,
యోగనిద్రసమాధిలో దిగి యూగులాడెడి యీశుడై,
స్వాగతమ్మనె శ్రీయశోకుడు సాదరమ్ముగ శారదన్.

Monday, May 3, 2010

మా ఆవిడ డాక్టరేటు!

డిఫెన్స్ అయిన మరుక్షణం శార్వాణి స్పందించిన తీరు:

కం:-
అయిపోయె డిఫెన్సు, భళా!
అయిపోదును డాక్టరేటు అతితొందరలో,
కయిగిల్లుడి కల కాదని,
పయనము పలునాళ్ళదొసగె పసిడి ఫలమ్మున్.

Thursday, February 18, 2010

యుగాది

కం:-
తల్లికి, తండ్రికి, విద్యా
వల్లభులకు, వేల్పులకును, పరమేశునకున్,
ఉల్లమున విరాజిల్లెడి
యెల్లరి పూజకు యుగాది యిరవుగ వెలసెన్.

ఉగాది కవిసమ్మేళనంలో నేను పూరించిన సమస్యలు:-

చం:-
అట్నములెట్లుగట్టెదము, ఆపదలొచ్చెనె యాంధ్రదేశమున్!
కట్నము కోట్లలెక్కలుగ గట్టితిమీ తొడగొట్టు నేతకున్,
పట్నములమ్ము పొట్లముల పాలకుడే గద రావణుండహో!
రాట్నము చేతబట్టుకొని రాక్షస కృత్యము చేసినాడహో!

ఆ:-
సారు పెరిగెనిచట చారన్నమున్ తించు,
యెన్నికవక మునుపు యెగువ సభకు.
వారి పేరు కాన, వూరికంటించారు
పేరు గొప్ప కాని వూరు దిబ్బ.

కం:-
లావొక్కింతయు లేదు, ప
లావులు పది ప్లేట్లపైనె లాగించిందే!
బావురుమనకోయి పతీ!
ఆవిడ యాకలి కనుగొని ఆలస్యముగా.

కం:-
కావలె కవినని తలచుచు,
నే వలచితి కవితలన్ను నిరుడేగా! డీ
లావొక్కింతయు లేదు, స
జావుగ యిదిసాగిన యదె చాలనుకొందున్.

Monday, February 15, 2010

చమత్కారం

నాకు, మా ఆవిడకి మధ్య సంభాషణ, పద్యరూపంలో. రెడ్మండ్ నుంచి డాలస్ (రెండువేల రెండువందల మైళ్ళు) కారులో వెళ్దాం అని...

కం:-
కారెక్కి చేరుకొనెదము,
తేరగ మీయక్కయింట తినిత్రేన్చెదమోయ్.
దూరము భారమె కాదన,
సారధి నేనేగ, తగవు సందేహములున్.

కం:-
కారంటూ పోరు తగదు,
దూరాలకు రాను నేను దుర్గమగతులన్.
బేరాలాడకు, వేరుగ
యేరోప్లేనెక్కివత్తు, యేడ్వకు నాథా!

కొంటెగా కవ్విద్దామని,
కం:-
కుదురుగ బుద్ధియు నుంచదు,
కుదరదు కదుపని విషయము కువలయమందున్,
బెదురును కదిపిన పిమ్మట,
ముదితకు మరి మరకటముకు ముచ్చటలొకటౌ!

నా కవితల పోరుపడలేకపోతున్నానంటున్న మా ఆవిడ రియాక్షన్.
కం:-
కైతల రాయుని గట్టుకు
నైతిని నేనప్పడంబు, అయ్యో వినడే!
నాతని, కోతని, మూతని,
నాతల తింటాడు వీడు నానా విధముల్.