కం:-
అగణిత బుద్ధులనిస్తివి
సుగుణమ్ములె మమ్ముగావు సూత్రములనుచున్,
ద్విగుణీకృతముగ భగణులు
సగతులు తొడిగేను నాదు జన్మన తల్లీ!
కం:-
సందీపుని చెలిమి వలన
సందేహములెన్నొదీరి ఛందోరీతిన్,
ఇందీవరమల్లె విరియు
కందములల్లుటకుదిరెను క్రమముగ నాకున్.
కం:-
మధ్యాక్కఱఛందస్సున
పద్యమ్ముల వేయినిలిపి పదిశతకములన్,
విద్యావిశ్వాధిపులుగ
నాదిక్కైనారు సత్యనారాయణులున్.
సీ:-
నాదురచనలందు నారాయణునిగొల్చి, వేయిపడగల సన్నాయినూది,
సాక్షాత్తు శ్రీలక్ష్మి సాయాన పాదాలు శ్రేయాన మెలగంగ సేవజేసి,
క్షీరసాగరశోభె సారమై జనియించు పద్యపద్మములకు పతిగజేసి,
విశ్వనాథుల కేకలవ్యశిష్యుండైతి, శారదాంబ ఒడికి చేరువైతి.
ఆ:-
గురువులేనిలోటు చెరపినారుగ నాకు,
సిరులనందజేసి విరివిగానె.
అంకితమ్ముజేతు యక్కరమ్ములునాల్గు,
స్వీకరింపుమయ్య విశ్వనాథ!
కం:-
గౌరీశముపంతులుగా
రీరవికవనానికయ్యె ఈశ్వరకృపచే,
శారద వీధుల శోభగ
తేరున ఊరేగువిభుగ, తేజోమయుగా!
సీ:-
ప్రాసయతుల తీరె పారాణులుగ తీరు భాషయొక్కటి చాలు భాగ్యమునకు;
యింపైన భావాల సంపగి మాలవ్వు పాద సౌఖ్యమె చాలు పద్యమునకు;
కమనీయ గమకాల కాసారములె చాలు రాయంచలుగ సాగ రాగములకు;
పరమాత్మ పాదాల దరి చేరగోరేటి భావమొక్కటె చాలు జీవమునకు.
తే:-
అట్టి సంగీతమే నరయ నమృతంబు,
నట్టి సాహిత్యమౌ మద్హృదార్చితంబు.
స్వస్తి!సాధింపనీ జన్మ సార్ధకంబు,
యమరు నమరత్వమారమా నమనమందు.
ఆ:-(తెలుగు తల్లి సొగసు)
తేటగీతిలోన తేనెలొలుకుతాను
ఆటవెలదితనలొ ఆటలాడు
సీసపద్యమె తన చీనాంబరముకాగ
కందమవ్వుహరిది చందనమ్ము
ఆ:-
వృత్తరీతులేమి కొత్తగాదుతనకు
చిత్తుజేయువాట్ని చిటికలోనె
యెంతమత్తునింపొ యీదేవతామూర్తి
సేదదీరజేయు సేవకునకు.
ఆ:-
తృప్తికలుగకుంటె దృక్కునిల్పినమీరు
అక్కరౌనుమధ్య, అక్కఱాద్లు.
తన్విదీర్చతనలొ తరియించు రతనాలు
అన్నియిన్నిగాదు అరయునంతె.
Friday, January 22, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment