Friday, January 22, 2010

అవనిజ

ఈ ముద్దులొలికే పాప మా మరదలి కూతురు, అవనిజాతన్మయి.

కం:-
చేతులు చెవులకు జాపుతు
మూతొంకరజేసి ముద్దుమురిపాలొలికే
చేతలతో తన్మయి తన
తాతయ్యకు ఊసుదెల్పి తాంబుడుగడిగెన్.

(తాంబుడుగు ఆట ఆడించమని అడిగే విధానం)

సీ:-
చింతవీడవె పిల్ల, చీకాకులెందుకే? చిన్నారి కన్నులకు చినుకు తగదె!
నీలాల కన్నులకు జోలాలి పాటలతొ నిదురుదెచ్చేయమ్మ నెదురె గలదె.
పొద్దుగూకేదాక ముద్దుమురిపాలివ్వ యిద్దరమ్మలులేరె యింటనీకు?
పొద్దుపొడిచేదాక సద్దుచేయకనీవు కునుకులమ్మనుచేరి కుదుట పడవె.

(పడుకొనే ముందు ఏడుస్తూ ఉంటే రాసిన పద్యం. ఇద్దరమ్మలు అంటే వాళ్ళమ ఆఫీసుకి వెళ్తే, తన పిన్నమ్మ అంటే మా ఆవిడ, తన అమ్మమ్మ.)

ఆ:-
పాలబుగ్గలొలుకు పసిడి నవ్వులజల్లు,
పండువెన్నెలండి పసిముఖమ్ము.
తన్మయత్వమడిగి తనపేర జేరింది,
అవనిజన్న మాకు అమితప్రీతి.

మా బంగారానికి నడకొస్తోందిట, ఇలాగ:
కం:-
బుడిబుడి అడుగులు పడునట
తడబడుతూ తల్లివైపు, తకధిములౌతూ.
ఒడిజేరుకొనుటకొరకవి,
బుడతవి, బుజ్జమ్మకాళ్ళు, భూచక్రములై!

2 comments:

  1. బావున్నాయండీ. ఎత్తుగీతి, ఆ చిన్నారినీ మీ ప్రేమను మా కళ్లముందు ఉంచింది.
    సీసం కూడా హాయిగ లాలిలా సాగిపోయింది కానీ ఒకటీ అరా మాత్రలెక్కువయ్యాయి.

    ReplyDelete
  2. బాగున్నాయి. అవనిజ మీ వదినగారి కూతురు అనుకుంటాను. ప్రారంభంలో గేయాలవంటి ఛందోరహిత పదాల్ని రాస్తే, భాష మీద ఉన్న పట్టుతో, లయ కుదురుతుంది. తదుపరి కందాలూ, సీసాలు నల్లేరు మీద నడకే! ఏమైనా కందం రాసినవాడు కవి! శుభం...

    ReplyDelete