Saturday, January 23, 2010

అంతర్మథనం

కం:-
నాకలవికాని పనులను
యే కలగనుచునొ,యెరుగక నెంచితి దేవా!
నీ కనుల చలువ గాంచని
నాకలమేగతిగ సాగు? నాగాననుడా!

కం:-
నేడొక పర్వదినంబని
వేడుక జరిపించమనుచు వేడెడి మనమున్,
ఏడకు గొనిపోయెద? కద
లాడగ వడగాడ్పుసెగలు రగులుచునుండన్!

శా:-
లోలోనే మథనం బడేవ మిగులన్, లోటవ్వ సంతోషముల్?
కూల్దోయాలి గదా సదా అనయముల్, కూడించి ధైర్యాదులన్,
ఆలోచించు అధైర్య పీడవిడినన్, ఆకాశమే హద్దుగా
నీలోనే వికసించు నూత్నసుమముల్, నీరాజనం బట్టుచూ.

కం:-
మదియది మారము జేసిన,
కదిలింపక వాయినపుడు కాయుటెమేలోయ్!
ముదముగ గారము జేస్తివి,
కదనములౌ క్షణములోన కాదని సూరీ!
(కొత్తపాళీగారికి ముందు వ్రాసిన పద్యంలో తప్పులు చూపించినందుకు కృతజ్ఞతలతో...)

మధ్యాక్కఱ:-
యతినాకుచెల్లకున్నది మహేశ! నీహారముగ్రప్పె
మతికి నీదయలేకే. యేమిజెప్పిన భారమునీదె!
నా తెలివికియందని పని నినుగాదనమ్మిబూనితి? వె
లితి లేకుండుగజూడు స్వామి! నినుజేర లింగ! దారిమ్ము.

మధ్యాక్కఱ:-
యేలోపములజూసి నన్ను కృపజూసియేలగరావొ
దెలియుటలేదు మహేశ! బ్రోవనని పలుకకయ్య.
నాలోని గాఢాంధకారమును మాపి, నానాటికీ క
నుల నీవె వెల్గయ్యె వరమునిమ్ము, అనుపమ ప్రకాశ!

కం:-
పుట్టిన రోజున గారుర
దిట్టలు యే గొప్పవారు, దీనులగానే
మెట్టుల నెక్కుచు బోవగ
కొట్టును లోకము సలాము కోరుచు సూరీ!
(అబ్బాయ్ అందించిన స్ఫూర్తి)

2 comments:

  1. మీ పద్యాసక్తి కి అభినందనలు.

    మధ్యాక్కరల ఛందస్సు నాకు తెలియదు గాని ఇక్కడున్న నాలుగు పద్యాల్లో ఆ రెండూ బాగున్నై, ఒక సహజమైన నడకతో.

    కందంలో ఒక సూత్రమున్నది . తొలిపాదం గురువుతో మొదలైతే అన్నీ గురువుతో, లఘువుతో మొదలితే అన్నీ లఘువుతో అని.

    ధ-ద లకి ప్రాస చెల్లదు నాకు తెలిసి.

    ముఖ్యమైన గమనిక .. గణాలు కిట్టించుకోవడం కోసం పదాలని బ్రామా ప్రెస్సులో పెట్టి నొక్కితే కృత్రిమంగా ఉంటుంది. ఉదా. కూల్దోయాలి, నీరాజనం బట్టుచూ .. వ్యక్తీకరణలో సహజ సౌందర్యం కోసం ప్రయత్నించండి.
    యతి కిట్టక పోవడం సమస్య అయితే కొన్నాళ్ళు యతిని పరిగ్రహించి పద్యధార సాధించడమ్మీద దృష్టి పెట్టండి.
    All the best.

    ReplyDelete
  2. ఆ:-
    కందమందుకళ్ళు గాన్కజేసినదప్పు
    పట్టినట్ట కొత్తపాళిగార్కి,
    అన్యసూచనలకు, ధన్యవాదములతొ
    దిద్దుకొందునంచు తెలుపుచుంటి.

    మధ్యాక్కఱ:
    ప్రతి పాదంలో [2 ఇంద్రగణాలు, 1 సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 1 సూర్యగణం] వరుసగా వస్తాయి.
    ప్రాస నియమం పాటించాలి. యతి 5వ గణం మొదటి అక్షరం.

    ReplyDelete