Thursday, July 7, 2011

మా బంగారం రెండవ పుట్టినరోజు

(పై ఫొటోలో బంగారం)
కం:-
కిలకిల నవ్వుల మాటున
పలువన్నెల జాబిలనుచు, పదపదమనుచున్
బిలబిల తారలె యిలదిగి
జిలుగులు దిద్దేను, గనుము శ్రీ లక్ష్మినిటన్.

(... ఇంకా ఇక్కడ బోలెడన్ని పద్యాలు ఉన్నాయి...)

(పిన్ని పాటలు)
ఆ:-
శ్రావ్య రాగములను శర్వాణి పలికింప
వినగ గల్గెనయ్య వేణుగోప!
తనదు రుచిర గళము కనకాంబరపుమాల
లల్లి నీకు పూజలందజేయ!

Sunday, August 15, 2010

భారత స్వాతంత్ర్యపర్వదినం

కం:-
మాతల్లి! భూమి భారతి
చేతన మహనీయ ధాత్రి! చేతున్ జయతుల్;
స్వాతంత్ర్యపర్వదినమున
భూతలి నలుదిక్కులలర భూయిష్ఠముగన్!

కం:-
దేశము భాషామతము
ద్దేశములున్ వేరువేరు తీరులనంచూ,
ఆశీవిషముకు వలెనా
వేశాగ్రణిగ మనుట, తగు మేలా మనకున్?

మత్తకోకిల:-
భారతీ! భరతాది దివ్యుల భవ్యసీమవు నీవుగా!
వారణాసి, గయప్రయాగల వాసిగాంచిన భూమివై,
మారణాయుధ ఘాతముల్, మరి మాయజేసెడి నేతలన్
ఓరిమిన్ భరియింపజాలున? నోడగొట్టుమ వారలన్!

Sunday, August 8, 2010

శివునిపై "శ్రీ" చక్ర బంధ తేటగీతము

తే:-
శిశిర రాజుకు శ్రీకంఠి చేవ; దేని
నిబిడు నాముఖశ్రీ? ఫాలనీలికాంతి
యమళులందున శ్రీలు; మాయా స్వభావ!
శివుని ఛాయన నిర్భీతి జీవరాశి.

భా:-
శివుడంటే జటాజూటాలతో భీతిగొలిపేలా ఉంటాడని, స్మశానంలో నర్తిస్తాడని విని భయపడనవసరంలేదు. చంద్రునకు ఆయనే కదా ఆధారం. నీలి కలువలలో ఆయన మూడవనేత్రాన్ని కలిగి ఉండే ఫాలము యెక్క కాంతే కదా ప్రతిబింబిస్తుంది. వీటిని చూసి మనం ఆనందించటంలేదా? మాయతో కూడిన స్వభావం కలవాడు కనుకనే మనకు అలా అనిపిస్తుంది. అసలు చెప్పాలంటే ఆయన రక్షలో సృష్టి యెంతో సురక్షితం.

Wednesday, July 14, 2010

సరదాగా కొన్ని పద్యాలు - మా బంగారం

ఈ వారం-వచ్చే వారం, పని-ప్రయాణాలవల్ల గట్టి ప్రయత్నాలు కుదరకపోవచ్చనిపించి, సరదాగా, సరళంగా ఉండే కొన్ని పద్యాలు వ్రాయదల్చుకున్నాను.

కం:-
అవనిజకు ఆరుపళ్ళను
వివరము సవరింపబడెను, విందురు వార్తన్:
నవనవలాడుచు ముందుకు
యెవరడ్డమునాకనంచు యేడవదొచ్చెన్.

మా బంగారానికి ఇప్పుడు ఏడు పళ్ళు, యేడాది వయసు.

ఆ:-
తిప్పుకుంటునడచు, తిరమెన్నడెరుగదు,
తప్పటడుగులేయు గొప్పగాను!
చెప్పనలవికాదు చిన్నారిపొన్నారి
చేతలన్ను, చిత్ర రీతులన్ను.

ఆ:-
భాషనేర్చెనండి బంగారమీమధ్య,
నిముషనిముషమునకు నేదొజెప్పు.
అర్ధమవ్వకున్న ఆగ్రహించదులెండి,
మరల మరల జెప్పు నెరవుగాను.

రాను పోను వెయ్యిమైళ్ళకు పైగా ప్రయాణం చేసి, మా బుజ్జికన్నని చూసి, ఆశీర్వదించి యిప్పుడే వెనకొచ్చాం. మాకు తను పంచియిచ్చిన ఆనందానికి కనీసం యింకా ఒక డజను పద్యాలైనా బాకీ ఉన్నాను. త్వరలోనే వ్రాస్తాను. పైనున్న పద్యాలు వాళ్ళమ్మ చెప్పినవి నా మాటల్లో చెప్పాను. క్రిందివి మేము మా అవనిజను చూసి వచ్చిన తర్వాత వ్రాసినవి.


ఆ:-
నిదురలేవగానె వెదకులాడును, తల్లి
జాడగనినయంతె జాతరగును.
అవనియందమంత అవనిజ ముఖమౌను,
ఆక్షణమ్ము మాకు అమరమగును.

ఆ:-
అమ్మచంకనెక్కి యబ్బురమ్ముగొలుపు
అరుణకాంతితేజ మవనిజండి!
కలికి సిరుల మూట! కమలాసనునిచేత
రంగరింపబడిన రంగవల్లి!


ఆ:-
పక్కనున్నపిన్ని ప్రక్కజూచిన చిన్ని,
ఒక్కనవ్వు రువ్వి ఒడికి యెగసె.
పిన్ని,బిడ్డ నొకరి ప్రేమలో నొకరైరి,
మురిపములబడి తలమునకలైరి.

(బంగారం)కం:-
పిన్నీ! పరమానందము,
నిన్ను గనిన నాకగు గద! నీకూ నగుగా!
యెన్నో జన్మల బంధము
లెన్నగ నీసాటివారు యెవ్వరు నాకున్?

(పిన్ని)కం:-
కన్నా! నా కంటి వెలుగ!
యెన్నగ నాకెవ్వరగునె, యెదలోతులలో
మిన్నగ నీకన్న? గలవె
చిన్నారిని మించు సిరులు సృష్టిన వెదుకన్?

(ఇంతలో నన్ను చూసిన బంగారం)కం:-
బాబాయ్! వచ్చేసావా!
యీ బుజ్జిది నిన్ను చూసి యెన్నాళ్ళయెనో!
నా బెంగ తీర భుజముల
నీ బంగారాన్ని యెత్త, నిను మురిపింతున్!


అంటూ రెండు చేతులూ చాపి నావైపు పరుగులందుకుంది.

Thursday, July 8, 2010

చ"తురంగ"బంధ కందం

ఓ వరసిద్ధి వినాయకా!
కం:-
అనుపమ గుణనిధివని యల
రిన నిను, దొర! గని, సుగుణచరిత! మురియు మదిన్,
గని నిను నిరతము, యిలను, క
లను, నను గనగ కలిగె ఘనలతిక కవితగన్.

భా:-
సాటిలేనటువంటి గుణాలకు నిలయముగా శోభిల్లే ఓ వినాయకా! చక్కని చరిత కలవాడా! నిన్ను చూస్తే చాలు మురిసిపోయే నా మదిలో నిన్ను నిరతమూ ఇలలోనూ కలలోనూ కూడా తలుస్తూ(చతురంగబంధకందం ప్రసాదించవయ్యా! అంటూ), నాదిక్కుగా చూసేటప్పటికి ఈ పొడవైన తీగలాంటి(సర్వలఘు కందం కదా!) కవిత కలిగిందయ్యా!

ఈ కందంలో "నిరతము నినుగన ఘనతరమగునని" అనే అర్ధంతో సాగే తురగగతులను క్రింద చూడవచ్చు.

ఇంకా స్పష్టంగా వ్రాయచ్చనిపించింది కాని, ప్రస్తుతానికి నా సామర్థ్యత ఇంతేనేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రయత్నంలో పదాల యెంపిక గురించి చాలా నేర్చుకోగలిగాను. పూజ్యులైన శ్రీ చింతా రామకృష్ణారావుగారికి యెంతో కృతజ్ఞుణ్ణి. నా దృష్టిలో ఈ ప్రయత్నం అంతగా ఫలించకపోయినా, మెప్పుతెచ్చే తృప్తి కంటే విమర్శలిచ్చే నొప్పే ఈ విద్యలో రాణించడానికి యెక్కువగా ఉపయోగపడుతుందని తలచి, ప్రచురిస్తున్నాను. స్వేచ్ఛగా మీ అభిప్రాయాలను తెలుపగలరు.


Tuesday, July 6, 2010

"శ్రీరామా!"యని

శా:-
"శ్రీరామా!"యని తల్చినంత మనమున్, శింజానమంజుధ్వనిన్
క్రూరాంతర్గతభూరిదుర్గుణతతిన్ క్రుంకింపగా జేయుచూ,
ఘోరాటంకవినాశతత్పరమతై, కోదండమే యండగా,
మా రాముండు మహాద్భుతమ్ముగ గనున్, మమ్మెల్ల సౌఖ్యమ్మునన్.


వృత్తాలంటే జంకు పోవాలని ఈ సాహసం చేసాను. రాముడంటే మొట్టమొదట నాకు ధర్మాన్నెన్నడూ కాపాడే ధనుర్బాణాలే గుర్తొస్తాయి. వాటితో మనల్ని కాపాడతాడనే భావం తీసుకు రావడంకోసం, ధ్వనులకంటే భావానికి ప్రాధాన్యతనిస్తూ వ్రాసాను. తప్పులు గమనిస్తే తెలుపగలరు.

Monday, June 28, 2010

సరదాగా సర్వలఘు కందం

కం:-
ఛురికనొదలి తురగగతిని
పరుగిడవలెననుచు మనము, పలువిధములుగన్
హరిచరణములకు ప్రణతులు,
కరివదనునకును వినతులు ఘనమని తెలిపెన్.

చ"తురంగ" బంధం వ్రాయాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది. ఎవరి గురించి వ్రాసి నన్ను బంధముక్తుణ్ణి చేసుకోవాలో నిర్ణయించుకోలేక పోతుంటే, పైన యిద్దరి గురించి యెన్ని విధాలుగా వ్రాసినా బాగుంటుదని నా మనసు తెలుపుతోంది అన్నది నా ఉద్దేశం.