Wednesday, July 14, 2010

సరదాగా కొన్ని పద్యాలు - మా బంగారం

ఈ వారం-వచ్చే వారం, పని-ప్రయాణాలవల్ల గట్టి ప్రయత్నాలు కుదరకపోవచ్చనిపించి, సరదాగా, సరళంగా ఉండే కొన్ని పద్యాలు వ్రాయదల్చుకున్నాను.

కం:-
అవనిజకు ఆరుపళ్ళను
వివరము సవరింపబడెను, విందురు వార్తన్:
నవనవలాడుచు ముందుకు
యెవరడ్డమునాకనంచు యేడవదొచ్చెన్.

మా బంగారానికి ఇప్పుడు ఏడు పళ్ళు, యేడాది వయసు.

ఆ:-
తిప్పుకుంటునడచు, తిరమెన్నడెరుగదు,
తప్పటడుగులేయు గొప్పగాను!
చెప్పనలవికాదు చిన్నారిపొన్నారి
చేతలన్ను, చిత్ర రీతులన్ను.

ఆ:-
భాషనేర్చెనండి బంగారమీమధ్య,
నిముషనిముషమునకు నేదొజెప్పు.
అర్ధమవ్వకున్న ఆగ్రహించదులెండి,
మరల మరల జెప్పు నెరవుగాను.

రాను పోను వెయ్యిమైళ్ళకు పైగా ప్రయాణం చేసి, మా బుజ్జికన్నని చూసి, ఆశీర్వదించి యిప్పుడే వెనకొచ్చాం. మాకు తను పంచియిచ్చిన ఆనందానికి కనీసం యింకా ఒక డజను పద్యాలైనా బాకీ ఉన్నాను. త్వరలోనే వ్రాస్తాను. పైనున్న పద్యాలు వాళ్ళమ్మ చెప్పినవి నా మాటల్లో చెప్పాను. క్రిందివి మేము మా అవనిజను చూసి వచ్చిన తర్వాత వ్రాసినవి.


ఆ:-
నిదురలేవగానె వెదకులాడును, తల్లి
జాడగనినయంతె జాతరగును.
అవనియందమంత అవనిజ ముఖమౌను,
ఆక్షణమ్ము మాకు అమరమగును.

ఆ:-
అమ్మచంకనెక్కి యబ్బురమ్ముగొలుపు
అరుణకాంతితేజ మవనిజండి!
కలికి సిరుల మూట! కమలాసనునిచేత
రంగరింపబడిన రంగవల్లి!


ఆ:-
పక్కనున్నపిన్ని ప్రక్కజూచిన చిన్ని,
ఒక్కనవ్వు రువ్వి ఒడికి యెగసె.
పిన్ని,బిడ్డ నొకరి ప్రేమలో నొకరైరి,
మురిపములబడి తలమునకలైరి.

(బంగారం)కం:-
పిన్నీ! పరమానందము,
నిన్ను గనిన నాకగు గద! నీకూ నగుగా!
యెన్నో జన్మల బంధము
లెన్నగ నీసాటివారు యెవ్వరు నాకున్?

(పిన్ని)కం:-
కన్నా! నా కంటి వెలుగ!
యెన్నగ నాకెవ్వరగునె, యెదలోతులలో
మిన్నగ నీకన్న? గలవె
చిన్నారిని మించు సిరులు సృష్టిన వెదుకన్?

(ఇంతలో నన్ను చూసిన బంగారం)కం:-
బాబాయ్! వచ్చేసావా!
యీ బుజ్జిది నిన్ను చూసి యెన్నాళ్ళయెనో!
నా బెంగ తీర భుజముల
నీ బంగారాన్ని యెత్త, నిను మురిపింతున్!


అంటూ రెండు చేతులూ చాపి నావైపు పరుగులందుకుంది.

4 comments:

  1. రవీంద్ర గారూ,
    ధన్యులు మీరు. ఎంత చక్కని పద్యాలు చెప్పారు! చాలా బాగున్నాయి. మీ చ"తురంగ" బంధ కందం ఈ రోజే చూసాను. అద్భుతం. చింతా వారి పద్యాన్ని చూసి నేనూ ప్రయత్నించి విఫలుడ నైనాను. అభినందనలు.

    ReplyDelete
  2. సందీప్ గారి బ్లాగు నుంచీ ఇక్కడికొస్తున్నాను. మీ బ్లాగు నిదానంగా చూడాలి. అవనికి జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. పద్యాలు బాగున్నయి, మీ అమ్మాయికి ఆశీస్సులు...

    ReplyDelete
  4. శంకరయ్యగారూ!
    మీ అభినందనలకు పాత్రుడనవ్వటం నా భాగ్యమని భావిస్తాను. మీరు నా పద్యాలలో లోపాలను పక్కనుంచి, కృషికి అభినందిస్తున్నారని తెలుసు. తప్పక ఇప్పటిదాకా వ్రాసిన వాటికంటే మున్ముందు మేలైన పద్యాలే వాయాలని నా అభిలాష. అలాగే మీరు విఫలురయ్యారన్నారు. కానీ, ఈ పద్యం వ్రాసి నేను నేర్చుకున్న దానికంటే, ప్రయత్నంలోనే మీరు యింకా యెక్కువే నేర్చుకుని ఉంటారని నా నమ్మకం. మీ ప్రయత్నం త్వరలోనే ఫలిస్తుందని ఆశిస్తూ,
    రవీంద్ర.

    ReplyDelete