Monday, May 24, 2010

గురువుగారికి ఒక సీసం

మా గురువుగారైన అశోక్ పాటల కమ్మదనాన్ని యెన్నిపద్యాలలో చెప్పినా తనివి తీరదు. యిదొక చిన్న ప్రయత్నం మాత్రమే.
సీ:-
మందార మకరంద మాధురీఝరి పారు
గంధర్వు గళసీమ గమకమందు.
ఆ సుందరాకారు అధరాల ప్రభవించు
సర్వస్వమద్వైత సారమేను.
విశ్వంభరను శంభువిఘ్నేశ్వరులతోడ
విమలస్వనాకేళి వేళగూడి,
మధుసూదనుడె హృదై, మహలక్ష్మి యాడంగ,
మునిగిదేలెడిహాయి న్ముంచియెత్తె!

ఆ:-
అతని గానమందు ఆత్మడోలికలాడు,
జతగ కూడి జతులు జవము పెంచు.
గమక పాకమౌను కమలాకరము క్రింద,
నింగి దిశన దిగెడి గంగె యగును.

ఆ:-
యెంత జెప్పుకొన్న కొంతయేనగునండి,
మంత్రమేసినట్టె మదికి దోచు.
అంతరాత్మ యెన్నడాబద్ధమాడదు,
ఉన్నమాటెమీకు విన్నవిస్తి.

అలాగే,
మత్తకోకిల:
శ్రీ గణేశునిరూపమై, తను శ్రీనివాసుని గేహమై,
రాగధార సుధాంశువై, ఘనరత్నభాను ప్రకాశమై,
యోగనిద్రసమాధిలో దిగి యూగులాడెడి యీశుడై,
స్వాగతమ్మనె శ్రీయశోకుడు సాదరమ్ముగ శారదన్.

1 comment:

  1. చక్కని ప్రయోగం చేశావు బాబాయ్!

    "మందారమకరంద" అనే మాటతో పద్యం మొదలుపెట్టడం అంటే చాలా సాహసమనే చెప్పుకోవాలి. ఐనా పాదాన్ని విజయవంతంగా రక్తికట్టించావు.

    ReplyDelete