ఓ వరసిద్ధి వినాయకా!
కం:-
అనుపమ గుణనిధివని యల
రిన నిను, దొర! గని, సుగుణచరిత! మురియు మదిన్,
గని నిను నిరతము, యిలను, క
లను, నను గనగ కలిగె ఘనలతిక కవితగన్.
భా:-
సాటిలేనటువంటి గుణాలకు నిలయముగా శోభిల్లే ఓ వినాయకా! చక్కని చరిత కలవాడా! నిన్ను చూస్తే చాలు మురిసిపోయే నా మదిలో నిన్ను నిరతమూ ఇలలోనూ కలలోనూ కూడా తలుస్తూ(చతురంగబంధకందం ప్రసాదించవయ్యా! అంటూ), నాదిక్కుగా చూసేటప్పటికి ఈ పొడవైన తీగలాంటి(సర్వలఘు కందం కదా!) కవిత కలిగిందయ్యా!
ఈ కందంలో "నిరతము నినుగన ఘనతరమగునని" అనే అర్ధంతో సాగే తురగగతులను క్రింద చూడవచ్చు.
ఇంకా స్పష్టంగా వ్రాయచ్చనిపించింది కాని, ప్రస్తుతానికి నా సామర్థ్యత ఇంతేనేమో అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ప్రయత్నంలో పదాల యెంపిక గురించి చాలా నేర్చుకోగలిగాను. పూజ్యులైన శ్రీ చింతా రామకృష్ణారావుగారికి యెంతో కృతజ్ఞుణ్ణి. నా దృష్టిలో ఈ ప్రయత్నం అంతగా ఫలించకపోయినా, మెప్పుతెచ్చే తృప్తి కంటే విమర్శలిచ్చే నొప్పే ఈ విద్యలో రాణించడానికి యెక్కువగా ఉపయోగపడుతుందని తలచి, ప్రచురిస్తున్నాను. స్వేచ్ఛగా మీ అభిప్రాయాలను తెలుపగలరు.